శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (10:15 IST)

రసాయన శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం

రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. మానవ జీవన గమనంలో అత్యంత కీలమైన డీఎన్ఏ మరమ్మతులపై జరిపిన పరిశోధనలకుగాను వీరికి ఈ బహుమతి లభించింది. డీఎన్‌ఏ పాడైతే బాగుచేసే వ్యవస్థ శరీరంలో ఉంటుంది. ఆ వ్యవస్థలోని కణాలు పాడైపోయిన డీఎన్‌ఏను ఎలా బాగుచేస్తాయనే దానిపై ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దీనికి ఫలితంగా నోబెల్ పురస్కారం అందుకోనున్నారు.
 
 
వీరిలో స్వీడన్‌కు చెందిన టామస్‌ లిండాల్‌, అమెరికాకు చెందిన పాల్‌ మోడ్రిక్‌, టర్కిష్‌ - అమెరికన్‌ అయిన అజీజ్‌ సంకార్‌లు సంయుక్తంగా ‘రసాయన శాస్త్ర’ విభాగంలో 2015 నోబెల్‌ను గెలుచుకున్నారు. జబ్బులు, వయస్సు మీదపడిపోవడం వెనక ఉన్న డీఎన్‌ఏ పరివర్తన(మ్యుటేషన్‌)లను శరీర వ్యవస్థ ఎలా బాగుచేస్తుందో ప్రపంచానికి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిచయం జేశారు. 
 
ముఖ్యంగా ఈ శాస్త్రవేత్తలు ముగ్గురు ఔషధ రంగంలో కీలక మలుపును తీసుకొచ్చారని నోబెల్‌ జ్యురీ ప్రకటించింది. శరీరంలోని కణాల పనితీరును అర్థం చేసుకునేందుకు వారి పరిశోధన ఉపయోగపడటమే కాకుండా, వారసత్వంగా వచ్చే జబ్బుల వెనుక, కేన్సర్‌, వయసు పైబడటం వెనుక ఉన్న పరమాణు కారణాలను తెలియజేస్తుందని పేర్కొంది. ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ వర్ధంతి డిసెంబర్‌ 10వ తేదీన వీరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రాదనం చేయనున్నారు.