శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2015 (17:58 IST)

లఖ్వీ విడుదలపై పాక్ సుప్రీంలో పంజాబ్ ప్రభుత్వం పిటిషన్..!

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రదారి ఉగ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీ బెయిలుపై విడుదలకావడాన్ని సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం పాకిస్థాన్‌లోని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాహోర్ హైకోర్టు లఖ్వీని విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును రద్దుచేయాలని పంజాబ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. 
 
లష్కరే తొయిబా కమాండర్ అయిన లఖ్వీ 2008లో ముంబై దాడులకు పాల్పడి అనేక మంది ప్రాణాలపొట్టన పెట్టుకున్నాడు. లఖ్వీ విడుదలతో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయని, ప్రజల సాధారణ జనజీవనానికి లఖ్వీ విడుదల విఘాతం కలిగించే అవకాశాలున్నాయని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. 
 
ముంబై దాడి కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో లఖ్వీ విడుదల సరికాదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పంజాబ్ ప్రభుత్వం కోరింది. భద్రతా చట్టం ప్రకారం లాహోర్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి, లఖ్వీని తిరిగి అదుపులోకి తీసుకోవాలని కోర్టుకు విన్నవించింది.
 
కాగా ముంబై దాడుల కేసు విచారణకు పాకిస్థాన్ కోర్టు గడువు విధించింది. ఈ మేరకు జస్టిస్ నూరుల్ హక్ ఖురేషీ నేతృత్వంలోని ఇస్లామాబాద్ హైకోర్టు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణను మరో రెండు నెలల్లోగా పూర్తి చేయాలని ఇస్లామాబాద్ తీవ్రవాద వ్యతిరేక కోర్టును ఆదేశించింది. 
 
అదే సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన జకీర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణను కూడా కోర్టు వాయిదావేసింది. గడువులోగా విచారణ పూర్తి చేయకుంటే అప్పుడే లఖ్వీ బెయిల్‌ను విచారణకు స్వీకరిస్తామని తెలిపింది. 
 
పాకిస్థాన్ ప్రభుత్వం సరైన సాక్ష్యాలు చూపని కారణంగా ముంబై దాడుల సూత్రధారి ఉగ్రవాది అయిన లఖ్వీకి ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జైలు నుంచి విడుదలైన వెంటనే లఖ్వీ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయిన విషయం తెల్సిందే.