ఒక్క నిమిషంలో ప్రశాంతంగా చంపేస్తుంది: స్విట్జర్లాండులో సూసైడ్ మెషీన్ సిద్ధం
ఆత్మహత్య మహా పాతకం. భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను చివరికంటా అనుభవించాల్సిందే. మనిషి జీవిత చరమాంకంలో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. భరించలేని తీవ్రమైన సమస్యల బారిన పడవచ్చు. ఐనప్పటికీ వాటన్నిటినీ అధిగమించి మృత్యువు కబళించేవరకూ పోరాడుతుంటారు చాలామంది.
కానీ కొంతమంది మాత్రం అలాంటి బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఆయువు మూడే వరకూ ఆగాల్సిందే. అప్పుడే జీవుడికి పూర్తి విముక్తి కలుగుతుంది. ఈ జన్మలో అనుభవించకుండా అర్థంతరంగా తనువు చాలిస్తే మళ్లీ వచ్చే జన్మలో తప్పదన్నది ఆధ్యాత్మిక గ్రంధాల సారం.
ఈ విషయాలను ప్రక్కనపెడితే... ప్రపంచంలో మునుపు ఎన్నడూ జరగనవి, జరుగుతున్నాయి. చట్టవిరుద్ధమైనవి చట్టబద్ధమవుతున్నాయి. ఆత్మహత్య అనేది నేరం. కానీ దీనికి చట్టబద్ధత కల్పిస్తోంది స్విట్జర్లాండ్. ఎంతమాత్రం నొప్పి లేకుండా మనిషిని చంపేసే పరికరానికి అనుమతి ఇచ్చేందుకు సిద్ధమైంది. కాగా ఈ యంత్రాన్ని ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కనిపెట్టింది. దీని పేరు సార్కో.
ఇది ఓ సూసైడ్ మెషీన్. ఈ యంత్రంలోకి మనిషి వెళ్లి బటన్ నొక్కితే చాలు.... వెంటనే మనిషి కణజాలానికి అవసరమైన ప్రాణవాయును తగ్గించేస్తుంది. ఇదంతే కేవలం నిమిషంలోపే జరిగిపోతుంది. ఈ సమయంలో మనిషికి ఎలాంటి నొప్పి, బాధ వుండదు. ప్రశాంతంగా ప్రాణాన్ని వదిలేస్తాడు. ఐతే ఇలా ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రపంచంలో చాలా దేశాలు వ్యతిరేకం. కానీ స్విట్జర్లాండ్ మాత్రం భిన్నంగా దీనికి అనుమతి ఇస్తోంది. అంతా సజావుగా వుంటే స్విస్ దేశంలో ఇది 2022 నుంచి అందుబాటులోకి వస్తుంది.