శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (10:39 IST)

కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం కాదు : తేల్చి చెప్పిన పాకిస్థాన్!

కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ ప్రాంతం భారత్‌లో అంతర్భాగం కాదని తేల్చి చెప్పింది. ఇన్నాళ్లుగా జమ్మూకాశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వచ్చిన పాకిస్థాన్ ఇపుడు ఉన్నట్టుండి మాట మార్చడం గమనార్హం. 
 
కాశ్మీర్‌లోని హురియత్‌ నాయకులతో భారత్‌లోని పాక్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ చర్చలు జరపడంతో ఆగ్రహించిన భారత్‌ ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. దీనిపై పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి తస్నిం అస్లాం స్పందించారు. అబ్దుల్‌ బాసిత్‌.. కాశ్మీర్‌ వేర్పాటు వాదులతో మాట్లాడడం భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదని ఆమె వ్యాఖ్యానించారు. 
 
భారతదేశానికి పాక్‌ తాబేదారు కాదని.. సర్వసత్తాక దేశమని, జామ్ము-కాశ్మీర్‌ వివాదంలో ఒక చట్టబద్ధమైన భాగస్వామి అని పేర్కొన్నారు. చర్చల విరమణకు భారత్‌ చెబుతున్న ఈ కారణం ఒక సాకు మాత్రమేనని.. తాము హురియత్‌ నేతలతో చర్చలు జరపడం ఇదే మొదటిసారి కాదని అస్లాం పేర్కొన్నారు. గతంలో భారత్‌లో పాక్‌ తరపున పని చేసిన ఆమె.. ‘కాశ్మీర్‌ భారత్‌లో భాగం కాదు’ అని తేల్చిచెప్పారు. ‘‘అదొక వివాదాస్పద భూభాగం. దానిపై ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు.