శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 సెప్టెంబరు 2014 (10:56 IST)

తెలుగు భాష ప్రేమికులకు ఓ శుభవార్త: అమెరికాలో అధికారిక భాషగా తెలుగు!

తెలుగు భాష మాతృభాష నుంచి మాతృభాషగా మారిపోతుందని బాధపడే భాషా ప్రేమికులందరికీ శుభవార్త. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమాంట్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో తెలుగును అధికారిక ప్రపంచ భాషగా గుర్తించనున్నారు. 
 
9 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ప్రవాసాంధ్ర చిన్నారులు సిలికానాంధ్ర 'మనబడి'లో తెలుగు భాషను అభ్యసిస్తే వారికి ఫ్రీమాంట్ జిల్లా ఉన్నత పాఠశాలల విద్యాశాఖ నుంచి అంతర్జాతీయ భాషను అభ్యసించినందుకుగాను అధికారికంగా హైస్కూల్ క్రెడిట్స్ లభిస్తాయి.
 
ప్రస్తుతం ఫ్రీమాంట్ జిల్లాలో ఉన్న 29 ప్రాథమిక, 5 జూనియర్, 5 పూర్తి స్థాయి పాఠశాలల్లో 32 వేల మంది విద్యార్థులు ఉన్నారు. సిలికానాంధ్ర మనబడి ప్రతినిధులు విద్యాశాఖాధికారులతో సమావేశమై ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటుగా తెలుగు నేర్పిస్తూ, ప్రభుత్వం నుంచి అధికారికంగా గుర్తింపు దక్కించుకున్న తొలి సంస్థగా 'మనబడి' ఘనత సాధించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
 
ఈ ఒప్పందం ద్వారా కేవలం ప్రవాసాంధ్రులే కాకుండా, అమెరికన్లు సైతం తెలుగును నేర్చుకునేందుకు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మనబడి కార్యక్రమం ద్వారా అమెరికాలోని 40 రాష్ట్రాలు, మరో 15 దేశాల్లో రెండు వేలకు పైగా విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని వారు హర్షం వ్యక్తం చేశారు.