శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (11:30 IST)

ఉరిశిక్షల అమలుపై భారత్ పునరాలోచన చేయాలి : బాన్ కీ మూన్

ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి అమలు చేసే మరణదండన అమలును భారత్ నిలిపివేసేలా పునరాలోచన చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కోరారు. ఈ మేరకు ఆయన భారత్‌కు విజ్ఞప్తి చేశారు. ముంబై వరుస పేలుళ్ళ కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలుపై ఆయన స్పందిస్తూ... భారత్‌లో మరణశిక్షలు రద్దు చేయాలని కోరారు. కంటికి కన్ను సిద్ధాంతాన్ని అవలంభిస్తే.. ప్రపంచమంతా అంధులతో నిండిపోతుంది అన్న భారత జాతిపిత మహాత్మా గాంధీ మాటలను గుర్తుంచుకోవాలని బాన్ కీ మూన్‌తో పాటు.. హ్యూమన్‌ రైట్స్ సంస్థ సూచించింది. 
 
దీనిపై కేంద్రం కూడా స్పందించింది. మరణశిక్షపై చర్చను ఆహ్వానిస్తున్నామని బీజేపీ సర్కారు తెలిపింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మరణశిక్షపై చర్చను ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న చట్టాల ప్రకారమే యాకుబ్ మెమన్‌కు శిక్షను అమలు చేశామని చెప్పారు. మరణశిక్షను రద్దు చేయాలన్న ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని అంతకుముందు ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
అంతేకాకుండా, యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారైననాటి నుంచి దేశవ్యాప్తంగా మరణశిక్షలపై ఆసక్తికరమైన చర్చ కూడా ప్రారంభమైన విషయం తెల్సిందే. పార్టీలతో నిమిత్తం లేకుండా పలువురు పార్లమెంట్ సభ్యులు, న్యాయనిపుణులు, హక్కుల సంఘాల కార్యకర్తలు మరణశిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.