శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (19:43 IST)

ఆర్‌సీబీ జట్టులో భారీ మార్పులు.. ఆడమ్ జంపాకు హసరంగా

Hasaranga
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టీమ్ కోచ్‌ మారడంతో పాటు కొత్తగా ముగ్గురు ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా, పేసర్ దుష్మంత చమీరా, ఆస్ట్రేలియా ప్లేయర్ టీమ్ డేవిడ్ యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్‌ లీగ్‌లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ మార్పుల విషయాన్ని ఆర్‌సీబీ టీమ్ శనివారం అధికారికంగా ప్రకటించింది.
 
ఓవర్‌సీస్ ఆటగాళ్ల గైర్హాజరీల నేపథ్యంలోనే ఈ మార్పులు చేశామని స్పష్టం చేసింది. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లకు కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా వ్యక్తిగత కారణాలతో అందుబాటులో ఉండమని చెప్పారు. భారత్ వేదికగా లీగ్ జరుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయారు. తాజాగా ఈ జాబితాలో డానియల్ సామ్స్ కూడా చేరాడు. ఇక న్యూజిలాండ్ ప్లేయర్లు ఫిన్ అలెన్, స్కాట్ కుగ్లిలెజిన్ కూడా స్వదేశీ టీమ్ పర్యటనల నేపథ్యంలో దూరం కానున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ముగ్గురు ప్లేయర్లను తీసుకున్నట్లు ఆర్‌సీబీ పేర్కొంది.
  
ఇక ఆర్‌సీబీ హెడ్ కోచ్‌ సిమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, టీమ్ డైరెక్టర్ మైక్ హెస్సెన్ కోచ్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. ఇటీవల భారత్‌తో ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో చమీర, హసరంగా అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హసరంగా తన మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో భారత టీ20 సిరీస్ ఓటమిని శాసించాడు. 
 
వరల్డ్ నెంబర్ 2 టీ20 బౌలర్ అయిన అతను మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఏడు వికెట్లు తీసాడు. ఇక చమీరా తనదైన పేస్‌తో ఆకట్టుకున్నాడు. పృథ్వీషా, శిఖర్ ధావన్‌లను డకౌట్ చేశాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్.. ది హండ్రెడ్ లీగ్‌లో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే డానియల్ సామ్స్ స్థానంలో చమీరాను తీసుకున్న ఆర్‌సీబీ.. ఆడమ్ జంపా స్థానాన్ని హసరంగాతో భర్తీ చేసింది. కెన్ రిచర్డ్‌సన్‌ ప్లేస్‌ను డేవిడ్‌తో భర్తీ చేసింది.
 
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ సెకండాఫ్ లీగ్ జరగనుంది. ఇప్పటికే సీఎస్‌కే, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అరబ్ గడ్డపై ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఇతర ఫ్రాంచైజీలు ఈ నెలాఖారులోపు యూఏఈకి పయనం కానున్నాయి.
 
ఈ క్రమంలోనే ఆయా ఫ్రాంచైజీలు అందుబాటులో లేని ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసే పనిలో పడ్డాయి. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లో ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శన కనబర్చింది. కరోనాతో లీగ్ వాయిదా పడే సమయానికి 5 విజయాలతో టాప్-3‌లో నిలిచింది.