శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (11:39 IST)

ఐపీఎల్‌-9: గుజరాత్ లయన్స్ బోణీ.. పంజాబ్‌కు పరాజయం..!

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్‌ టోర్నీలో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో లయన్స్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. విండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అద్భుత బౌలింగ్‌కు తోడు.. ఆరోన్‌ ఫించ్‌, దినేష్‌ కార్తీక్‌ వీరవిహారంతో సొంతగడ్డపైనే కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌కు లయన్స్‌ షాకిచ్చింది. తద్వారా పంజాబ్ పరాజయం పాలైంది. 
 
పేరుకు తగినట్లు గుజరాత్ లయన్స్ ఆటగాళ్లలో ఆరోన్‌ ఫించ్‌ (47 బంతుల్లో 12 ఫోర్లతో 74) అర్ధ సెంచరీకి తోడు డ్వేన్‌ బ్రావో (4/22) రాణించారు. తద్వారా గుజరాత్ 5 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచి.. టోర్నీలో శుభారంభం చేసింది. సోమవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో.. ఆతిథ్య పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మురళీ విజయ్‌ (42), మనన్‌ వోహ్రా (38), మార్కస్‌ స్టోయినిస్‌ (33) రాణించారు. 
 
డ్వేన్‌ బ్రావో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, జడేజా 2 వికెట్లు తీశాడు. అనంతరం గుజరాత 5 వికెట్లు కోల్పోయి మరో 14 బంతులు మిగిలి ఉండగానే సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫించ్‌ హాఫ్‌ సెంచరీకి తోడు దినేష్‌ కార్తీక్‌ (26 బంతుల్లో 7 ఫోర్లతో 41 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.