శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:14 IST)

సెల్ తీశారో కాల్ చార్జీల మోత తప్పదు.. 12-15 శాతం పెరిగే అవకాశం..!

మొబైల్ వినియోగదారులకు కాల్ ఛార్జీల మోత మోగనుంది. స్పెక్ట్రమ్ వేలం నేపథ్యంలో భారీగా చెల్లించి అనుమతులు పొందిన కంపెనీలు తమ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం మొబైల్ కాల్ చార్జీలను 12 నుంచి 15 శాతం మేరకు పెంచేందుకు సిద్ధమైపోయాయి. 
 
స్పెక్ట్రమ్‌ (గాలి తరంగాలు)ను వేల కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన కంపెనీలు ఆ భారాన్ని తట్టుకోవాలంటే ఈ భారాన్ని మోపక తప్పదని ద సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వేలం దెబ్బకు తమపై పడిన భారాన్ని తట్టుకోవాలంటే.. ప్రస్తుత టారిఫ్‌లపై 12 నుంచి 15 శాతానికి పైగా పెంపు తప్పదని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. 
 
టెలికాం ఆపరేటర్లు ఇప్పటకే ఏటా తమ ఆదాయంలో 13-14 శాతం మేర లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీల కింద ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్టు గుర్తుచేసింది. ఒకవైపు తమ ఖర్చులు ఇంత భారీస్థాయిలో ఉండగా.. ఆదాయం చూస్తే సగటున ఒక వినియోగదారుడి నుంచి వస్తున్న ఆదాయం కేవలం 2.96 డాలర్లు మాత్రమేనని, అంతర్జాతీయంగా ఈ సగటు 35 నుంచి 40 డాలర్ల దాకా ఉందని తెలిపింది.
 
అయితే, కాల్‌ చార్జీలు పెరిగే అవకాశం ఉందంటూ టెలికాం కంపెనీలు చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ సెక్రటరీ రాకేష్‌ గార్గ్‌ విశ్లేషించారు. స్పెక్ట్రమ్‌ కొనుగోళ్ల కాలపరిమితి 20 ఏళ్ల వరకూ ఉంటుంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే టెలికం కంపెనీలకు ఏడాదికి సగటున 5300 కోట్లకు మించి ఖర్చు కాదని, ఈ భారాన్ని తట్టుకునేందుకు ఆ కంపెనీలు ప్రస్తుతం ఉన్న కాల్‌రేట్లపైన నిమిషానికి 1.30 పైసలు చొప్పున పెంచితే సరిపోతుందని మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.