శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జులై 2015 (10:46 IST)

సెల్ఫ్ పికప్ స్టోర్లను ప్రారంభించనున్న ఫ్లిప్ కార్ట్: మార్చి నాటికి 100కి పైగా..

ఈ-కామర్స్ సేవల సంస్థ ఫ్లిప్ కార్ట్... వాణిజ్యాన్ని పెంచుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించి వ్యాపారాన్ని పెంచుకోడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తోంది. ఆన్ లైన్లో ఆర్డర్ బుక్ చేసుకున్న తరువాత రోజుల తరబడి వేచిచూసే అవసరం లేకుండా, వెంటనే వెళ్లి వస్తువును తెచ్చుకునే సౌకర్యాన్ని సులభతరం చేసింది. 
 
ఈ దిశగా సెల్ఫ్ పికప్ స్టోర్లను ప్రారంభించినట్టు సంస్థ సీనియర్ డైరెక్టర్ నీరజ్ అగర్వాల్ ప్రకటన చేశారు. కస్టమర్లు తమకు అనువైన సమయంలో ఈ స్టోర్లకు వెళ్లి తాము ఆర్డరిచ్చిన ప్రొడక్టులను తీసుకెళ్లవచ్చునని తెలిపారు. దేశవ్యాప్తంగా 20 సెల్ఫ్ పికప్ స్టోర్లను ప్రారంభించామని, ప్రత్యామ్నాయ డెలివరీ మోడల్‌గా ఇది పనిచేస్తుందన్నారు. మార్చి నాటికి 100కు పైగా సెల్ఫ్ పికప్ స్టోర్లు ప్రారంభిస్తామని వివరించారు.
 
ఐటీ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, విద్యా సంస్థలు తదితరాల్లోకి డెలివరీ బాయ్స్‌లు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, దీనివల్ల కస్టమర్లకూ అసంతృప్తి కలుగుతోందని నీరజ్ అగర్వాల్ గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఈ తరహా ఆలోచన చేసినట్టు నీరజ్ వివరించారు.