శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (14:19 IST)

స్మార్ట్ ఫోన్ల పుణ్యం: ఇంటర్నెట్ వినియోగంలో అమెరికాను భారత్ అధిగమిస్తుందా?

స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి రావడం, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగం పెరగడం వంటివి ప్రపంచ అంతర్జాలం (ఇంటర్నెట్) వినియోగంలో అమెరికాను భారత్ అధిగమించడానికి దోహదం చేస్తున్నాయని అమెరికాకు చెందిన రిసెర్చ్ సంస్థ ఈమార్కెటీర్ వెల్లడించింది. దీంతో 2016 నాటికి ప్రపంచంలో ఆన్‌లైన్ యూజర్ ఆధారిత దేశాల్లో చైనా తర్వాత నిలిచి, రెండో స్థానంలో భారత్ నిలవనుందని చెప్పింది. 
 
2016 నాటికి భారత్‌లో ఆన్‌లైన్ యూజర్ల (ఇంటర్నెట్ వినియోగదారులు) సంఖ్య 283.8 మిలియన్లకు చేరనుందని ఈ మార్కెటీర్ వివరించింది. ఇదే సమయంలో అమెరికా 264.9 మిలియన్లతో భారత్ వెనుక ఉంటుందని తెలిపింది. 
 
ఇక 2018లో ఆన్‌లైన్ యూజర్లు భారత్‌లో 346.3 మిలియన్లుగా, అమెరికాలో 274.1 మిలియన్లుగా ఉంటారంది. ఇదిలావుంటే చైనా ఇప్పటిలాగే మున్ముందు ఇంటర్నెట్ వినియోగదారుల విషయంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని ఈమార్కెటీర్ స్పష్టం చేసింది. 2016 నాటికి చైనాలో ఆన్‌లైన్ యూజర్లు 700 మిలియన్లు, 2018 నాటికి 777 మిలియన్లుగా ఉంటారని పేర్కొంది. 
 
కాగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులు 2015లో 3 బిలియన్లకు చేరనున్నారు.