శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (11:15 IST)

లోక్‌సభలో ఎంత మంది కోటీశ్వరులు : నకుల్ నాథ్ ఆస్తి ఎంతో తెలుసా?

దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మొత్తం 543 మందికిగాను 542 మంది ఎంపీలు కొత్తగా ఎన్నికయ్యారు. ఈ సభలో గతంలో ఎన్నడూ లేనంతగా కోటీశ్వరులు ఉన్నారు. 
 
మొత్తం 542 మంది సభ్యుల్లో ఏకంగా 475 మంది కోటీశ్వరులు ఉన్నారు. అంటే 88 శాతం. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. వీరిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తనయుడు నకుల్‌నాథ్ రూ.660 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచారు. 
 
ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన 303 మంది ఎంపీల్లో 265 మంది (88 శాతం) కోటీశ్వరులు కాగా.. కాంగ్రెస్ నుంచి గెలిచిన 51 మందిలో 43 మంది ఎంపీలు (96 శాతం) కోటీశ్వరులుగా ఉన్నారు. 
 
ఎన్‌డీఏ మిత్రపక్షం శివసేన పార్టీ తరుపున గెలిచిన మొత్తం 18 మంది ఎంపీలు కోటి కంటే ఎక్కువ ఆస్తులు గలవారే. డీఎంకే నుంచి 22 మంది (96 శాతం), టీఎంసీ నుంచి 20 మంది (91 శాతం), వైసీపీ నుంచి 19 మంది (86 శాతం) ఎంపీలు కోటీశ్వరులని నివేదిక పేర్కొంది. 
 
ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మొదటి ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ వాళ్లే కావడం గమనార్హం. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 315 (58 శాతం) ఎంపీలు, 2014లో 443 (82 శాతం) ఎంపీలు కోటీశ్వరులుగా పార్లమెంటులో అడుగుపెట్టారు.