శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PY REDDY
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (09:26 IST)

మరోమారు రగలనున్న మత మార్పిళ్ళు చిచ్చు

ఘర్ వాపసీ.. పేరుతో విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మత మార్పిడులను చేపడుతోంది. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఇటీవల 200 మంది ముస్లింలను హిందూ మతంలోకి మార్చడంపై దుమారం చెలరేగుతుండగానే గుజరాత్, కేరళలలోనూ తాజాగా మతమార్పిళ్లు చోటుచేసుకున్నాయి. విశ్వ హిందూ పరిషత్ గుజరాత్‌లోని వాల్సద్‌లో ఉన్న అర్నాయ్ గ్రామంలో శనివారం 100 కుటుంబాలకు చెందిన 500 మంది గిరిజన క్రైస్తవులను  హిందూ మతంలోకి మార్చింది. 
 
వాల్సద్‌లో గిరిజనులను తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే ముందు మహా యజ్ఞం నిర్వహించిన వీహెచ్‌పీ అనంతరం వారందరికీ భగవద్గీతలు, రాముని పటాలు, రుద్రాక్ష మాలలను అందించింది. గతంలో క్రైస్తవంలోకి మారిన వీరంతా తిరిగి హిందూ మతంలోకి వచ్చేందుకు సుముఖత చూపడంతో ఈ కార్యక్రమం (ఘర్ వాపసీ) నిర్వహించినట్లు వీహెచ్‌పీ స్థానిక నేత అజిత్ సోలంకి తెలిపారు. 
 
ఆదివారం కేరళలోని అలప్పుజ జిల్లాలో 8 కుటుం బాలకు చెందిన 30 మంది దళిత క్రైస్తవులను తిరిగి హిందూ మతంలోకి చేర్చింది.కాణిచానల్లోర్‌లో ఉన్న ఓ గుడిలో ఘర్ వాపసీ కార్యక్రమంలో ఎనిమిది దళిత క్రైస్తవ కుటుంబాలకు చెందిన 30 మందిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చారు. మరో 150 క్రైస్తవ కుటుంబాలు తిరిగి హిందూమతం పుచ్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాయని కేరళ వీహెచ్‌పీ నేత పాడిక్కల్ తెలిపారు. 
 
 క్రైస్తవులంతా తిరిగి హిందూ మతంలోకి వచ్చేంత వరకూ ‘ఘర్ వాపసీ’ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పారు. కాగా, స్వచ్ఛంద కార్యక్రమం కావడం వల్ల ఇందులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధి నితిన్ పటేల్ తెలిపారు. దేశ వ్యాప్తంగా దుమారానికి మరోమారు మతమార్పిడి వేదిక కానున్నది.