శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 మే 2016 (16:40 IST)

గాంధీ-నెహ్రూ పేర్లే పెట్టాలా? రిషికపూర్ పేరు పెట్టొచ్చుగా.. పబ్లిక్ టాయిలెట్స్‌కు..?!

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇందిరాగాంధీ పేరెందుకు పెట్టారని.. జాతిపిత మహాత్మా గాంధీ, భగత్ సింగ్, డాక్టర్ అంబేద్కర్ ఇలా ఎవరి పేరైనా పెట్టొచ్చు కదా అంటూ.. అవసరమైతే తన పేరు కూడా పెట్టండి అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. 
 
ఢిల్లీలోని అక్బర్ రోడ్డును మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలని కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన ప్రతిపాదనపై రిషి కపూర్ స్పందిస్తూ.. ఢిల్లీ రోడ్ల పేర్లు మారుస్తున్నప్పుడు దేశ సంపదగా పరిగణిస్తున్న విమానాశ్రయాల పేర్లు కూడా మార్చాలన్నారు. అన్నింటికీ గాంధీ-నెహ్రూ కుటుంబీకుల పేర్లే ఎందుకు ఉండాలన్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తుల పేర్లను విమానాశ్రయాలు వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాక తన తండ్రి రాజ్‌కపూర్ కూడా దేశానికి ఎంతగానో గుర్తింపు తెచ్చారని, ఒకరకంగా రాజకీయంగా కన్నా మంచి పేరు తెచ్చారని ఆయన వెల్లడించారు.
 
అయితే రిషికపూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు పబ్లిక్ టాయిలెట్‌కి రిషికపూర్ పోస్టర్లు అతికించి ఆందోళనకు దిగారు. రిషి కపూర్ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.