శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (17:50 IST)

రాష్ట్రపతిగా ఉన్నా... కుటుంబీకులకు సొంత డబ్బుతో రైలు టిక్కెట్లు బుక్ చేసిన కలాం!

అబ్దుల్ కలాం కేవలం ఒక క్షిపణి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగానేకాకుండా.. సాదాసీదా మానవతావాదిగా కూడా ఉన్నారు. దీనికి అనేక సంఘటనలు ఉదహరించుకోవచ్చు. తమిళనాడులోని రామేశ్వరంలో కలామ్‌ ఒక పెద్ద కుటుంబంలో జన్మించారు. కానీ, వారెవరూ రాష్ట్రపతి భవన్‌ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఆయన దేశానికి ప్రథమ పౌరుడుగా ఉన్నా.. వారంతా సామాన్యమైన పనులు చేసుకుంటూ గడిపారు. ఆయన కుటుంబీకులు రాష్ట్రపతి భవన్‌కు వచ్చేందుకు వారికి అవసరమైన రైలు ప్రయాణ టిక్కెట్లను తన సొంత డబ్బులతో రిజర్వు చేయించారు. రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పటికీ.. ప్రజా ధనాన్ని పైసా కూడా తన సొంత ఖర్చులకు వినియోగించుకోలేదు కదా.. దానికి జవాబుదారీగా వ్యవహరించినవారే.
 
 
అంతేకాకుండా, ఆయన రాష్ట్రపతిగా ఉన్నా.. రాష్ట్రపతి పదవినుంచి దిగిపోయినా... ఆయన తన వ్యక్తిగత భద్రతపై ఏనాడూ కించిత్ ఆందోళన చెందలేదు. అతి తక్కువ భద్రతతోనే తాను ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆయన వెళ్లిపోయేవారు. రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన తొలిసారిగా కేరళలోని తిరువనంతపురంలోని రాజ్‌‌భవన్‌కు వెళ్లారు. అక్కడ 'రాష్ట్రపతి అతిథి'గా ఆయన ఎవరిని ఆహ్వానించారో తెలుసా!? ఒక చిన్న హోటల్‌ యజమానిని. 
 
త్రివేండ్రంలోనే కలాం శాస్త్రవేత్తగా పనిచేసే సమయంలో ఒక హోటల్‌ యజమానితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగివుండేవారు. ఆ హోటల్లోనే కలాం భోజనం చేసేవారు. రాష్ట్రపతి అయిన తర్వాత కూడా మర్చిపోకుండా ఆయన ఆ హోటల్‌ యజమానిని పిలిపించుకుని మరీ మాట్లాడారు. అలా తనలోని మానవతాకోణాన్ని నిరూపించుకున్నారు.