సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (09:37 IST)

పాకిస్తాన్‌తో కొత్త చిక్కు.. గుజరాత్‌లో మిడతల దాడి.. 5వేల హెక్టార్ల పంట గోవిందా..

పాకిస్తాన్ నుంచి ఇబ్బందులు ఏదో ఒక రూపంలో వచ్చి పడుతూనే వున్నాయి. జమ్మూ కాశ్మీర్ అంశంపై ఇప్పటికీ పాకిస్థాన్‌తో దాయాది పోరు జరుగుతోంది. పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో పంజాబ్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే ఇంటలిజెన్స్ హెచ్చరించింది. ఓ వైపు  పాకిస్థాన్ టెర్రరిస్టులతో భారత్‌కు ఇబ్బందులు పొంచి వున్న వేళ.. ప్రస్తుతం ఆ దేశపు మిడతలు కూడా భారత ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
 
తాజాగా పాకిస్థాన్ మిడతల దండు ఇండియాపై దండెత్తుతూ, గుజరాత్‌లో పంటలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. సమూహాలుగా వస్తున్న మిడతలు బనాస్ కాంఠా, మహసానా, కచ్, సాబర్ కాంఠా తదితర ప్రాంతాల్లో ఆవాలు, జీలకర్ర, బంగాళాదుంప, గోధుమ, జీలకర్ర, పత్తి తదితర పంటలను నాశనం చేస్తున్నాయి.
 
బనాస్ కాంఠా జిల్లాలో ఈ మిడతల కారణంగా ఇప్పటివరకూ 5 వేల హెక్టార్లలో పంట నాశనమైంది. మిడతలను ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం నానా తంటాలూ పడుతుండగా, సమస్య తీవ్రతను గమనించిన కేంద్రం, 11 బృందాలను రాష్ట్రానికి పంపింది.
 
డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులను చల్లడం ద్వారా వీటిని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. మందులు చల్లినా. డప్పులతో పెద్ద శబ్దాలు చేసినా మిడతల దాడి ఆగట్లేదు. దీంతో రైతుల నుంచి నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో మిడతల కారణంగా పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని సీఎం విజయ్ రూపానీ తెలిపారు.