శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (15:39 IST)

జయకు విజయశాంతి బాసట : అమ్మకోసం పోలీసు సూసైడ్ యత్నం!

అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత త్వరలో విడుదలవుతారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేత, మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. జయలలిత జైలు నుండి మరింత శక్తితో బయటకు వచ్చి రాష్ట్రాన్ని మళ్లీ సుభిక్షంగా పాలన చేస్తారన్నారు. 
 
మరోవైపు.. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంజయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం చెన్నైలోని తమిళనాడు డీజీపీ కార్యాలయం ముందు ఆ రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వేల్ మురుగన్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన సహచర పోలీసులు.. మైలాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తేని సమీపంలోని ఒడైపట్టై పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వేల్ మురుగన్ మంగళవారం ఉదయం కిరోసిన్ డబ్బా పట్టుకొని నేరుగా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. 
 
కార్యాలయం ముందు ఒక్కసారిగా ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వేల్ మురుగన్ అమ్మా అంటూ జయలలిత పేరును పెద్దగా పలుకుతూ ఒంటికి నిప్పంటించుకునేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.