శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (14:31 IST)

అజాంఖాన్ అడ్డుపుల్లతో జయప్రదకు చేజారిన ఎమ్మెల్సీ టిక్కెట్

సినీనటి జయప్రదకు అదృష్టం కలిసిరాలేదు. ఈ దఫా మాత్రం రాజకీయ ప్రత్యర్థి, తన బద్ధశత్రువు, ఎస్పీ సీనియర్ నేత, సీనియర్ మంత్రి అజాంఖాన్ అడ్డుపుల్ల వేయడంతో ఆమెకు ఎమ్మెల్సీ టిక్కెట్ అదృష్టం వరించినట్టే వరించి చేజారింది. 
 
తనకు రాజకీయ జన్మనిచ్చిన సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు జయప్రద సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఆమెను పార్టీలో చేర్చుకుని తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు అధినేత ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేశ్ యాదవ్ సుముఖంగా ఉన్నారు. గవర్నర్ కోటా కింద విధాన్ పరిషత్‌కు 9 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు చేశారు. అందులో ఆమె పేరు కూడా ఉంచారు. 
 
అయితే, జయప్రద అంటే గిట్టని అజాంఖాన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తిరిగి పార్టీలోకి జయను తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి వీల్లేదని మొండి పట్టుబట్టారు. దాంతో చేసేదిలేక ఆమె పేరును పార్టీ పక్కన బెట్టాల్సి వచ్చింది. ఇలాగే 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా జయప్రద అభ్యర్థిత్వాన్ని అజాం వ్యతిరేకించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది.