శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (15:22 IST)

విదేశీ పర్యాటకులను వేధిస్తే జైలే గతి : కేంద్ర మంత్రి మహేశ్ శర్మ

దేశంలో పర్యటించే విదేశీ పర్యాటకుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తొలుత ఈ కఠిన చర్యలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయనుంది. ఈ కొత్త నిబంధనల మేరకు.. యూపీలో పర్యాటకులను వేధిస్తే జైలుపాలవక తప్పదని కేంద్ర పర్యాటక, సాంస్కృతి శాఖామంత్రి మహేశ్ శర్మ హెచ్చరించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ టూరిస్టులను వేధింపులకు గురిచేయడాన్ని ఇక నుంచి నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపారు. ఇటీవల కాలంలో ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద మహిళా పర్యాటకులపై కొన్ని అభ్యంతరకర ఘటనలు చోటుచేసుకున్నాయి. గతకొంతకాలంగా ఈ చారిత్రక ప్రదేశానికి వచ్చే టూరిస్టుల సంఖ్య క్రమేపీ పడిపోసాగింది. 
 
దీనిపై, లైసెన్స్‌డ్ గైడ్ల సంఘం అధ్యక్షుడు సంజయ్ శర్మ మాట్లాడుతూ, గతేడాది నుంచి 10 శాతం మేర టూరిస్టులు తగ్గిపోయారన్నారు. వేధింపుల కారణంగానే ఇలా జరుగుతోందని మంత్రి చెబుతున్నారని శర్మ తెలిపారు. కాగా, తాజ్ మహల్‌ను సందర్శించే వారిలో అత్యధికులు తాము దళారీలు, గైడ్లు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల చేతిలో మోసపోయామనో, వేధింపులకు గురయ్యామనో ఫిర్యాదులు చేయడంతో కేంద్రం ఈ తరహా చర్యలు చేపట్టింది.