శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (07:16 IST)

మావోయిస్టు అయితే అరెస్టు చేసేస్తారా...! అదేం నేరం కాదే..!! కేరళ కోర్టు

మావోయిస్టు అయినంత మాత్రానా అరెస్టు చేసేస్తారా..! ఎక్కడైనా.. భౌతిక దాడులకు పాల్పడ్డారా.. ఆస్తులు ధ్వంసం చేశారా.. లేక హింసాత్మక చర్యలకు దిగారా.. అలా కాకుండా మావోయిస్టు అనే పేరుతో అరెస్టు చేయడం కుదరదని కేరళ కోర్టు పోలీసులకు షాకిచ్చింది. శుక్రవారం వెలువరించిన తీర్పుతో పోలీసులు నిర్ఘాంత పోయారు. 
 
ఒక వ్యక్తిని నక్సలైట్ అనే ఏకైక కారణంతో అరెస్ట్ చేయడం కుదరదని స్పష్టం చేసింది. మన రాజ్యాంగ విధానాలతో వారి రాజకీయ సిద్ధాంతాలకు వైరుధ్యం ఉన్నప్పటికీ.. మావోయిస్టుగా ఉండటాన్ని నేరంగా పరిగణించలేమని తెగేసి చెప్పింది. ఆకాంక్షల ఆధారంగా ఆలోచించడం మానవుల మౌలిక హక్కని పేర్కొంది. ఒకవేళ వ్యక్తి కానీ, సంస్థ కానీ భౌతిక హింసకు పాల్పడటం లాంటి చర్యలకు పాల్పడితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, చట్టపర చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
 
నక్సల్‌గా పేర్కొంటూ శ్యామ్ బాలకృష్ణన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం తీర్పు ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్ మొహమ్మద్ ముస్తాఖ్ పై వ్యాఖ్యలు చేశారు. నేరం చేశాడనేందుకు ఆధారాలు లేకుండానే, కేవలం అనుమానిత మావోయిస్ట్ అనే ఏకైక కారణంతో బాలకృష్ణన్‌ను అరెస్ట్ చేశారని నమ్ముతున్నట్లు తెలిపారు.

అరెస్ట్ చేయడం ద్వారా బాలకృష్ణన్ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొంటూ.. బాలకృష్ణన్‌కు రెండు నెలల్లోగా రూ.లక్ష పరిహారంగా అందించాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో పదివేలు ఇవ్వాలని తీర్పునిచ్చారు.