శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (15:06 IST)

బిలావల్ కాశ్మీర్ కామెంట్స్ : ట్విట్టర్లో ఖండించిన ముస్లిం సంఘాలు!

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో కాశ్మీర్‌ను భారత్ నుంచి లాక్కుంటామని చేసిన వ్యాఖ్యలపై అనేకమంది ట్విట్టర్లో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. బిలావల్‌ను జోకర్‌గా పేర్కొంటూ సెటైర్లు వేస్తున్నారు. బిలావల్ వ్యాఖ్యలు అతిపెద్ద జోకులు అంటూ స్పందిస్తున్నారు.
 
భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ.. బిలావల్ వ్యాఖ్యలు చిన్నపిల్లాడివిలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. భుట్టో కుటుంబం జనరేషన్స్ మారినా.. మైండ్ సెట్ మాత్రం మారలేదని రామ్ మాధవ్ అన్నారు.
 
శశిథరూర్, సునంద పుష్కర్ వివాదంలో వెలుగులోకి వచ్చిన పాకిస్తాన్ మెహర్ తరర్ కూడా స్పందించారు. పాకిస్థాన్, భారత్‌లు పేదరికం, నిరుద్యోగం, అక్షరాస్యత, జనాభా, చిన్నతనంలో వివాహం, అత్యాచారాలు.. తదితర అంశాలపైన దృష్టి సారించాలని హితవు పలికారు.
 
బిలావల్ భుట్టో పైన ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ (ఐయూఎంఎల్) కూడా మండిపడింది. బిలావల్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేసింది. భారత్ భూభాగంలోని ప్రతి ఇంచును కూడా తాము చివరి నిమిషం వరకు కాపాడుకుంటామని చెప్పింది.  
 
భారత దేశం మొత్తం పదిహేడు కోట్ల మంది ముస్లీంలు భారత్ కోసం ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ చివరి రక్తపు బొట్టు వరకు భారత్ కోసం ఉన్నారన్నారు.
 
తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ముస్లిం సంఘాలు బలపరిచినట్లయింద రాజకీయ పండితులు అంటున్నారు. రెండు రోజుల క్రితం మోడీ మాట్లాడుతూ.. భారత్ ముస్లీంలు దేశం కోసం పని చేస్తారని, వారి దేశం కోసం బతుకుతారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.