శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (17:01 IST)

బీజేపీకి దమ్ముంటే నల్లధన వివరాలు బయటపెట్టాలి : దిగ్విజయ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే సుప్రీంకోర్టుకు సమర్పించిన నల్లధన కుబేరుల జాబితాను బహిర్గతం చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ బహిరంగ సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌లో కల్కి మహోత్సవాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 100 రోజుల్లో నల్లధనం వెనక్కి రప్పించి, ప్రతి వ్యక్తి ఖాతాలో మూడు లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పిన వ్యాఖ్యల్ని అమలు చేయడంలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. 
 
కేంద్రానికి ఏమాత్రం దమ్మూధైర్యం ఉన్నా విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారి ఖాతాల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అదేసమయంలో జన్‌ధన్ యోజన కోసం తాము ప్రారంభించిన బ్యాంకు ఖాతా వివరాలు ప్రధానికి పంపి, ఆ అకౌంట్లో రూ.3 లక్షలు జమ చేయాలని దేశ ప్రజలంతా డిమాండ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేసి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు.