శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (13:55 IST)

వాడో తాగుబోతు... 'మిలట్రీ భోజనం'పై వైరల్ అయిన వీడియోపై బీఎస్ఎఫ్ వివరణ (Video)

'మాకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదు. కొన్ని సార్లు మేంఖాళీ కడుపులతోనే రోజులు గడుపుతున్నాం' అని పేర్కొంటూ నియంత్రణ రేఖ వద్ద గస్తీ బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు బీఎస్ఎఫ్‌ జవాన్లు సోషల్‌ మీడియాలో విడుదలచే

'మాకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదు. కొన్ని సార్లు మేం ఖాళీ కడుపులతోనే రోజులు గడుపుతున్నాం' అని పేర్కొంటూ నియంత్రణ రేఖ వద్ద గస్తీ బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు బీఎస్ఎఫ్‌ జవాన్లు సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ వీడియోల్లో జవాన్లంతా ఒకేరకమైన ఆరోపణలు చేశారు. 
 
ఒక వీడియోలో.. చేతిలో తుపాకీ, యూనిఫాం కనిపించిన బీఎస్‌ఎఫ్‌ జవాను మొహం కనిపించకుండా తలకు గుడ్డను చుట్టుకుని కనిపించాడు. ‘మా కోసం కేంద్రం కొనుగోలు చేసే నిత్యావసరాలను మా పైఅధికారులు అక్రమ పద్ధతుల్లో మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు' అని పేర్కొన్నారు. 
 
మరో వీడియోలో.. 29వ బెటాలియన్‌కు చెందిన టీబీ యాదవ్‌(40) అనే బీఎస్‌ఎఫ్‌ జవాను.. తమకు పెట్టే భోజనాన్ని చూపించాడు. ‘‘మాకు బ్రేక్‌ఫాస్ట్‌ కింద పరోఠా, చాయ్‌ మాత్రమే ఇస్తారు. మేం అది తిని 11 గంటలు.. నిలబడి పనిచేయాలి. మధ్యాహ్నం రొట్టె, పప్పు ఇస్తారు. పప్పులో.. పసుపు, నీళ్లు ఉప్పు తప్ప ఏమీ ఉండదు. మాకు పెట్టే భోజనం నాణ్యత ఇదీ. ఈ అన్యాయాన్ని ఎవరూ గుర్తించరు.’’ అని యాదవ్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. 
 
దీనిపై గంటల వ్యవధిలోనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) స్పందించింది. ఆ వీడియోను పోస్ట్ చేసిన జవాన్ ఓ తాగుబోతని పేర్కొంది. ఆ వీడియోలో మాట్లాడిన జవాను పేరు తేజ్ బహదూర్ యాదవ్ (29) అని, అతనో తాగుబోతని, తరచూ నిబంధనలు మీరుతుంటే అతనికి, విధుల్లో చేరినప్పటి నుంచి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చామని ఓ ప్రకటనలో తెలిపింది.
 
సీమా సురక్షా బల్‌లో జవానుగా ఉన్న అతను, వాస్తవాధీన రేఖ వద్ద విధులు నిర్వహిస్తుంటాడని తెలిపింది. పైఅధికారులతో గొడవలు పడుతుండటం అతనికి అలవాటని తెలిపింది. బీఎస్ఎఫ్ జవాన్లకు ఇస్తున్న ఆహారంలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని, వారికి సరిపడినంత ఆహారాన్ని ఇవ్వట్లేదనడం అవాస్తవమని పేర్కొంది. కాగా, ఈ వీడియోపై విచారణ జరపాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.