శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (09:20 IST)

కేంద్ర హోంశాఖలో చిచ్చు... రాజ్‌నాథ్‌తో చనువుగా ఉన్న కార్యదర్శి బదిలీ?

కేంద్ర హోంశాఖలో చెలరేగిన ఆధిపత్య చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ స్వచ్చంధ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రాజీవ్ మెహ్రిషీ నియమితులయ్యారు. ఈ నియామకం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలియకుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. 
 
ఈ పరిస్థితుల్లో హోం శాఖ అదనపు కార్యదర్శి అనంత్‌ కుమార్‌ సింగ్‌ను పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా నియమించారు. ఆయనను తాజా రాజకీయ కారణాలతోనే బదిలీ చేశారా అన్న ప్రశ్నకు.. ఆ శాఖ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చనువుగా ఉండటమే అనంత్‌కుమార్‌ బదిలీకి కారణమని తెలుస్తోంది. 
 
శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఆయన కేంద్ర, రాష్ట్ర సంబంధాలు చూస్తుండేవారు. హోం మంత్రికి రాజకీయ సలహాదారుగా కూడా వ్యవహరించేవారు. ఇటీవల స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఎల్‌సీ గోయల్‌కు, అనంత్‌ కుమార్‌కు సఖ్యత లేదు. దీంతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరస్పరం అంశాలవారీగా విభేదించుకునేవారని.. గోయల్‌ తీరుపై హోం మంత్రి కూడా అసంతృప్తిగా ఉండేవారని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. ఈ సంగతులు ప్రధాని మోడీ దృష్టికి రావడంతో ఇద్దరినీ ఆ శాఖ నుంచి తప్పించి, ఇతర అధికారులకు పరోక్ష హెచ్చరికలు చేశారని పేర్కొంటున్నాయి.
 
1984 బ్యాచ్‌ ఉత్తర ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన అనంత్‌ కుమార్‌.. డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వచ్చారు. ఈయనను అదనపు కార్యదర్శిగా నియమించి 8 నెలలే అవుతోంది. కాగా.. ఈ బదిలీలతో ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎజెండా ప్రకారం, ప్రభుత్వం సూచించిన పాత్రకు అనుగుణంగా పని చేయకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్న స్పష్టమైన సందేశాన్ని ఈ బదిలీలతో మోడీ ప్రభుత్వం ఇచ్చిందని అధికారులు భావిస్తున్నారు.