శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జులై 2016 (14:30 IST)

నిశ్చితార్థం తర్వాత అమ్మాయి నచ్చలేదని పెళ్లి రద్దు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే : సుప్రీంకోర్టు

నిశ్చితార్థం తర్వాత లేదా మరే ఇతర కారణం వల్లనో అమ్మాయి నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు

నిశ్చితార్థం తర్వాత లేదా మరే ఇతర కారణం వల్లనో అమ్మాయి నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పును వెలువరించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీకి చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడి కొడుకుకు మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురితో పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థం కార్యక్రమాన్ని 2012 జూన్ 8వ తేదీన జరిగింది. ఇందుకోసం అయిన ఖర్చులన్నింటినీ వధువు కుటుంబం భరించింది. ఇది థానే నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించింది. 
 
ముహుర్త సమయం సమీపిస్తున్న తరుణంలో అమ్మాయి గురించిన నిజాలు చెప్పకుండా నిశ్చితార్థం చేశారంటూ అబ్బాయి తరపువారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన పెళ్లి కూతురి తల్లిదండ్రులు అబ్బాయితోపాటు అతని తండ్రిపై థానే పోలీసుస్టేషనులో సెక్షన్ 420 కింద కేసు పెట్టారు. దీంతో ఈ కేసులో అరెస్టు కాకుండా ముందు జాగ్రత్తగా అబ్బాయితో పాటు అతని తండ్రి ముందస్తు బెయిల్ పొందారు. 
 
అయితే, ఈ కేసును విచారించిన థానే కోర్టు మాత్రం నిశ్చితార్థం ఖర్చుల కింద రూ.1.5 లక్షలను వధువు తల్లిదండ్రులకు చెల్లించాలని ఆదేశించింది. దీనిపై తమకూ కూడా రూ.4.5 లక్షల ఖర్చు అయిందని అబ్బాయి కుటుంబం వాదించినప్పటికీ.. కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. 
 
ఆ తర్వాత కూడా వరుడు కుటుంబ సభ్యులపై వధువు తల్లిదండ్రులు పెట్టిన కేసును ఉపసంహరించుకోలేదు. దీంతో వరుడు తండ్రి బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. చివరకు మూడేళ్లకు ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఈ కేసును విచారించిన కోర్టు.. నిశ్చితార్థం తర్వాత అమ్మాయి నచ్చలేదనో... మరో కారణమో చెప్పి పెళ్లి రద్దు చేసుకోవాలంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేసింది.