శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2015 (07:57 IST)

వరద నీటితో మునిగిన చెన్నై విమానాశ్రయం: మూతపడిన రన్ వే

తమిళనాడు రాజధాని చెన్నైలో వరుణుడు ప్రతాపం చూపించాడు. వర్ష బీభత్సంతో చెన్నై సహా తమిళనాడులోని వివిధ జిల్లాల్లో వంద మందికి పైగా మృత్యువాతపడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం చెన్నై నగరాన్ని జలసంద్రంగా మార్చేసింది. నగరంలోని మెజారిటీ కాలనీలు నీట మునిగాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి దాకా క్షణం తెరిపి ఇవ్వకుండా కురిసిన వర్షం కారణంగా చెన్నై ఎయిర్ పోర్టు మూతపడింది. 
 
ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి వర్షపు నీరు చేరిపోయింది. అక్కడ నిలిచిన విమానాల అండర్ క్యారేజీలను తాకుతూ.. వరద నీరు ప్రవహించడంతో అక్కడ నిలిచిన విమానాల అండర్ క్యారేజీలను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. 
 
మొత్తం రన్ వే నీటిలో మునిగిపోయింది. దీంతో రన్ వే మూతపడింది. ఎయిర్ పోర్టులో 400 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రన్ వేపై చేరిన నీరంతా పూర్తిగా వెళ్లిపోయేదాకా విమాన సర్వీసులను పునరుద్ధరించలేమని ఎయిర్ పోర్టు డైరెక్టర్ దీపక్ శాస్త్రి చెప్పారు.