శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (14:31 IST)

'చైల్డ్ సెక్స్ ట్రేడ్ విలువ 343 బిలియన్ డాలర్లు' : కైలాష్ సత్యర్థి

భారత్‌లో అభంశుభం తెలియని చిన్నారులతో చేయిస్తున్న వ్యభిచారం వ్యాపారం విలువ 343 బిలియన్ డాలర్లుగా ఉందని నోబెల్ శాంతి బహుమతి విజేత, బాలల హక్కుల ఉద్యమకర్త కైలాశ్ సత్యర్థి చెప్పుకొచ్చారు.  ఈయన నేతృత్వంలోని గ్లోబల్ మార్చ్ అగెయినెస్ట్ చైల్డ్ లేబర్ పై జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 
 
ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి అపహరించిన అమ్మాయిలతో ఈ తరహా వ్యభిచారం నిరాఘాటంగా సాగుతోందని సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో పసిపిల్లలతో చేయిస్తున్న ఈ తరహా వ్యభిచారం తరాలుగా కొనసాగుతోందని కూడా ‘ఎకానమిక్స్ బిహైండ్ ఫోర్స్ డ్ లేబర్ ట్రాఫికింగ్’ పేరిట విడుదలైన ఆ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో 32 లక్షల మంది చిన్నారులు బలవంతంగా వ్యభిచార కూపంలో కొనసాగుతున్నట్టు తేలింది. 
 
వీరిలో 60 శాతం మంది బీహార్, అసోంలకు చెందిన చిన్నారులు కాగా, వీరంతా 14 నుంచి 16 ఏళ్ల వయసు మధ్యనున్న ఉన్నారని తెలిపారు. వీరిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారని ఈ అధ్యయనం తేల్చింది. అదేసమయంలో దేశవ్యాప్తంగా 1,100 రెడ్ లైట్ ఏరియాలుండగా, ఒక్కో రెడ్ లైట్ ఏరియాలో 140 దాకా బ్రోతల్ హౌస్‌లున్నాయి. 
 
ఒక్కో బ్రోతల్ హౌస్ పిల్లలను తార్చడం ద్వారా ఏటా 24 లక్షల డాలర్లను ఆర్జిస్తోంది. ఈ లెక్కన దేశంలో బాలికలను వ్యభిచార కూపంలోకి నెట్టడం ద్వారా ఏటా 343 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం సాగుతోందని కైలాష్ సత్యర్థి సంస్థ నిర్వహించిన అధ్యయంలో వెలుగు చూసింది.