శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Eswar
Last Modified: శనివారం, 26 జులై 2014 (16:49 IST)

కాంగ్రెస్ కు ఆత్మకథల ఫీవర్... నట్వర్ సింగ్ 'బుక్ బాంబ్' రెడీ

2014 ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుదేలైపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో భయం పట్టుకుంది. ఆగస్టు మొదటి వారంలో కేంద్ర మాజీమంత్రి నట్వర్ సింగ్ రాసిన పుస్తకం విడుదల కానుంది. ఇప్పటికే మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం కాంగ్రెస్ పరువు తీయగా తాజాగా నట్వర్ సింగ్ పుస్తకం కాంగ్రెస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఇప్పుడు ఆ పుస్తక రచయిత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట.
 
నట్వర్‌ సింగ్ ఆత్మకథ "వన్‌ లైఫ్ ఈజ్‌ నాట్ ఎనఫ్‌ ' 
 
'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్‌' పేరుతో నట్వర్‌ సింగ్ రాసిన ఆత్మకథ ఆగస్ట్ 7న విడుదల కానుంది. వన్‌ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్‌ పుస్తకంలో నట్వర్‌ సింగ్ కాంగ్రెస్‌ పనితీరును విమర్శించినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం, పార్టీపై సోనియా ప్రభావం, మన్మోహన్‌ సింగ్‌ను ఎలా కీలుబొమ్మగా మార్చిందీ ఈ పుస్తకంలో వివరించినట్లు సమాచారం. ఇప్పటికే సంజయ్‌ బారు పుస్తకం, మద్రాస్ హైకోర్టులో అవినీతికి పాల్పడిన జడ్జికి పదవీకాలం పొడగింపు తదితర అంశాలతో డీలా పడిన కాంగ్రెస్‌, నట్వర్‌ సింగ్‌ పుస్తకం విడుదలైతే పార్టీకి కలిగే నష్టంపై ఆందోళన చెందుతోంది.
 
2008లో కాంగ్రెస్ కు గుడ్ బై 
 
మొదట ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్ అధికారి అయిన నట్వర్‌ సింగ్, తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఇందిర, రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌ల ఆధ్వర్యంలో పని చేశారు. యూపీఏ హయాంలో 2004-2005 మధ్య కాలంలో నట్వర్‌ సింగ్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. భారత-అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందంలో భారత్ తరపున చర్చల్లో పాల్గొన్న వారిలో నట్వర్‌ సింగ్‌ కూడా ఒకరు.
 
ఐతే ఇరాక్‌తో కుదిరిన ఆయిల్‌ ఫర్‌ ఫుడ్‌ ప్రోగ్రాం కుంభకోణంలోనట్వర్‌ సింగ్‌ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2008లో నట్వర్‌ సింగ్ కాంగ్రెస్‌ పార్టీకీ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌ తనను అవమానించే రీతిలో పొమ్మనకుండానే పొగపెట్టిన తీరుపై నట్వర్‌ సింగ్‌ నాటి నుంచీ గుర్రుగా ఉన్నారు.
 
నట్వర్‌ను కలిసిన సోనియా, ప్రియాంక 
 
పుస్తకం వల్ల కలిగే నష్టాన్ని నివారించడం కోసం ఏకంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగారు. కొన్నాళ్ల క్రితం సోనియా తన కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి నట్వర్‌ సింగ్‌ ఇంటికి వెళ్లారు. నట్వర్‌తో సుమారు గంటసేపు సమావేశమయ్యారు. ఆ సమావేశం వివరాలను వెల్లడించడానికి నట్వర్‌ సింగ్ నిరాకరించారు. అయితే ఆ పుస్తకాన్ని విడుదల చేయవద్దని ప్రియాంక నట్వర్‌ సింగ్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే పుస్తకం విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో నట్వర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.