శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 17 జులై 2017 (03:02 IST)

గోవును తల్లిగా భావిస్తాం.. కానీ గోరక్ష పేరుతో జరిగే దౌర్జన్యాన్ని సహించం.. మోదీకి ఇప్పుడు గుర్తొచ్చిందా?

గోవును తల్లిగా భావిస్తాం. కానీ గోరక్ష పేరుతో జరిగే దౌర్జన్యాన్ని సహించం.. గోరక్షను కారణంగా చూపుతూ ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా కఠినంగా వ్యవహరిస్తాం.. గోరక్ష పేరుతో సంఘ వ్యతిరేక శక్తులు సమాజంలో అస్థిరతకు కారణమవుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ హె

గోవును తల్లిగా భావిస్తాం. కానీ గోరక్ష పేరుతో జరిగే దౌర్జన్యాన్ని సహించం.. గోరక్షను కారణంగా చూపుతూ ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా కఠినంగా వ్యవహరిస్తాం.. గోరక్ష పేరుతో సంఘ వ్యతిరేక శక్తులు సమాజంలో అస్థిరతకు కారణమవుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. గోరక్షకు సంబంధించిన చట్టాలున్నాయని కానీ నిబంధనలను ఉల్లంఘించి వ్యక్తులు చర్యలు తీసుకోవడం సమస్యకు ప్రత్యామ్నాయం కాదని మోదీ సూచించారు.
 
సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష నేతలతో మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. గోరక్ష పేరుతో జరుగుతున్న మత హింసను అరికట్టడంలో విపక్షాలు సహకారం అందించాలని ప్రధాని కోరారు. ఆవుపేరు చెప్పుకుని రాజకీయ, మత వివాదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గోరక్ష పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస, దౌర్జన్యాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. 
 
గోరక్షను కారణంగా చూపుతూ ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని.. పలువురు సంఘ వ్యతిరేక శక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమాజంలో అస్థిరతకు కారణమవుతున్నారని మోదీ తెలిపారు. ‘గోవును తల్లిగా భావిస్తాం. ఇది మన మనస్సుకు సంబంధించిన అంశం. గోరక్షకు సంబంధించిన చట్టాలున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించటమే సమస్యకు ప్రత్యామ్నాయం కాదు. సంఘ విద్రోహశక్తులు గోరక్షను ఉపయోగించుకుని అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఈ దేశంలోని సామాజిక సామరస్యానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.
 
'ఇలాంటి ఘటనలు దేశ గౌరవానికి భంగం కలిగిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’ అని అఖిలపక్ష భేటీలో తెలిపారు. కొంతకాలంగా దేశంలో గోరక్ష పేరుతో జరుగుతున్న అవాంఛిత ఘటనల్లో దళితులు, ముస్లింలే బాధితులవుతున్నారన్న విపక్షాల ఆందోళనల నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం∙సంతరించుకున్నాయి.