శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (11:51 IST)

గ్రామాన్ని వీడి ఢిల్లీకి చేరిన బీఫ్ బాధిత కుటుంబ సభ్యులు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, దాద్రి సమీపంలోని బిషాదా గ్రామంలో ఆవును చంపి ఆ మాంసాన్ని భక్షించారన్న అనుమానంతో మొహమ్మద్ ఇఖ్లాక్ అనే వ్యక్తిని గత నెల 28న స్థానికులు కొట్టిచంపిన వ్యవహారం దేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం ప్రత్యేకంగా దృష్టిసారించింది. 
 
మరోవైపు మృతుని కుటుంబ సభ్యులు బుధవారం బిషాదా గ్రామాన్ని వీడారు. తరుచూ ఉద్రిక్తతలు చోటుచేసుకొంటుండటంతో భద్రత కోసం ఇఖ్లాక్ కుటుంబం స్వగ్రామాన్ని వదిలి మంగళవారం రాత్రి ఢిల్లీకి తరలివెళ్లిపోయింది. అలాగే, గ్రామస్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఇఖ్లాక్ కుమారుడు, భారత వాయుసేన ఉద్యోగి సర్తాజ్ కోలుకున్నారు. నోయిడాలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న అతన్ని బుధవారం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. 
 
కాగా, బిషాదా గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకోవటంపై సాధ్వి ప్రాచీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి అనుమతిచ్చి తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గ్రామంలో మంగళవారం అనునామాస్పద స్థితిలో మరణించిన జయప్రకాశ్ కుటుంబాన్ని, పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ రాహుల్‌ యాదవ్‌ను పరామర్శించేందుకే తాను వెళ్తున్నానని ఆమె తెలిపారు. తనను అడ్డుకోవటం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు.