శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (14:22 IST)

ముందస్తు బెయిల్ రావడం సంతోషం.. అక్టోబరులో పవన్‌తో సినిమా : దాసరి నారాయణ రావు

బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి చోటు చేసుకున్న అక్రమాల కేసులో తనకు ముందస్తు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు అన్నారు. బొగ్గు స్కామ్‌లోని నిందితులందరికీ ఢిల్లీలోని పాటియాలా సీబీఐ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. 
 
దీనిపై దాసరి నారాయణరావు స్పందిస్తూ.. బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఢిల్లీలో అన్నారు. ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. న్యాయమే గెలుస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదేసమయంలో సినీ నటుడు పవన్ కల్యాణ్‌తో తాను నిర్మించబోయే సినిమా అక్టోబర్ నుంచి మొదలవుతుందని దాసరి వెల్లడించారు. 
 
కాగా, బొగ్గు స్కామ్‌ కేసు విచారణ పూర్తి అయినందున దాసరి సహా 14 మంది నిందితులకు శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బొగ్గు స్కాం కేసులో విచారణ ఎదుర్కుంటున్న దాసరి, నవీన్‌ జిందాల్‌, మధు కోడా శుక్రవారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసిన సీబీఐ కోర్టు దేశం విడిచి వెళ్లరాదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది.
 
జార్ఖండ్‌లోని అమరుకొండ ముర్గా దుంగల్‌ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో దాసరితో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్‌ జిందాల్‌, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్‌పై సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌, జిందాల్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహా ఐదు కంపెనీల పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్లో నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, చీటింగ్‌, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది.
 
చార్జిషీట్‌పై దార్యాప్తు చేపట్టిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి 14 మంది నిందితులు శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులు శుక్రవారం కోర్టు హాజరయ్యారు. నిందితుల తరపున వారివారి న్యాయవాదులు వాదించారు. అన్ని వాదనలు విన్న న్యాయమూర్తి... ఈ కేసుకు సంబంధించి 14 మందికి సాధారణమైన ఆంక్షలతో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.