శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (17:01 IST)

భార్యపై స్నేహితులతో అత్యాచారం.. కిరాతక భర్తకు పదేళ్ళ జైలుశిక్ష!

అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను తన స్నేహితుడితో అత్యాచారం చేసిన కిరాతక భర్తకు పదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీ నారెలా పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతి 2011 ఏప్రిల్ 21వ తేదీన కనిపించకుండా పోయింది. దీనిపై ఆ యువతి తండ్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె ఐదారు నెలలుగా కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువతి ఆచూకీని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో కనిపెట్టారు. ఆమెను నిర్బంధించిన ఇద్దరు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, ఆ యువతి కూడా పోలీసులకు ఒక వాంగ్మూలం ఇచ్చింది. 
 
తాను ఇష్టపడే ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాననీ, అయితే, తనను అతని స్నేహితుల వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేయించి, తీవ్రంగా గాయపరిచారని పేర్కొంది. ఆ తర్వాత ఈ కేసు విచారణ ఢిల్లీ కోర్టులో జరిగింది. ఈ కేసును విచారించిన అదనపు సెషన్స్ జడ్జి ఎంసీ గుప్తా మహిళ వైద్య నివేదిక కీలక సాక్ష్యమన్నారు. 
 
అయితే, నిందితుల తరపు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం చేసిన కారణంగా తమ క్లయింట్లను నిర్దోషులుగా ప్రకటించాలని కోరారు. ఈ వాదనను కొట్టిపారేస్తూ, అత్యాచార కేసుల్లో ఎఫ్ఐఆర్ దాఖలు ఆలస్యం కావడం సహజమని అన్నారు. అంతమాత్రాన దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొంటూ భర్తతో పాటు నిందితులకు పదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.