శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 3 మార్చి 2015 (15:34 IST)

కేజ్రీవాల్ పోస్టుకు ఎసరు... ప్రశాంత భూషణ్, యోగేంద్రలపై వేటు...?

మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 70కి 67 సీట్లిచ్చి బంపర్ మెజారిటీతో గెలిపించిన ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం మొదలైంది. ఆ పార్టీలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. పాలన సంగతి ఏమోగానీ ఒకరి కింద ఇంకొకరు గుంతలు తీసుకునే పరిస్థితి తలెత్తినట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్‌ను పార్టీ జాతీయ కన్వీనర్ పదవి నుంచి తప్పించాలని కుట్రలు జోరుగా సాగుతున్నట్లు గత వారంలో చోటుచేసుకున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
 
ఆప్ సీనియర్ నాయకులు యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌ భూషణ్ ఈ కుట్రకు కేంద్ర బిందువులని వారిద్దరిపైనా ఈ ఆరోపణలు రావడం విశేషం. దీనిపై ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సోమవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్‌ను పార్టీ జాతీయ కన్వీనర్ పదవి నుంచి తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ పరోక్ష విమర్శలు చేశారు. పార్టీ అంతర్గత విషయాలను బజారున పడవేయడం చూస్తుంటే వారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందన్నారు.
 
పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడిందని ప్రచారం చేస్తున్న వారిపై బుధవారం జరిగే పార్టీ జాతీయ ప్రతినిధుల చర్చించి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు సోమవారం నాటి సమావేశంలో కేజ్రీవాల్ కన్వీనర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఐతే సహచరులు వారించడంతో ఆయన మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం ఆ పార్టీని ఏ తీరానికి చేర్చుతుందో చూడాల్సిందే.