శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (19:26 IST)

హైదరాబాద్ తరహాలోనే ఏపీలోనూ సంస్థలు: వెంకయ్య నాయుడు

విద్య, వైద్య, సాంకేతిక, శిక్షణ సంస్థలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదని.. అయితే అలాంటి సంస్థలనే ప్రస్తుతం ఏపీలోనూ నెలకొల్పుతున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఏర్పేడు మండలంలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ లకు శంకుస్థాపన చేశామన్నారు.
 
ఐదేళ్లలో ఐఐటీ నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. శ్రీసిటీలో 70 ఎకరాల స్థలంలో ట్రిపుల్ ఐటీ నిర్మిస్తున్నట్టు తెలిపారు. విద్యాసంస్థలకు స్థల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని వెల్లడించారు. సమగ్ర భూగర్భ మురుగు కాల్వ పథకం కింద విజయవాడకు రూ.461 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ విభాగం ద్వారా వెయ్యి కోట్లు విడుదల చేయాలని స్వయంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందామని చెప్పారు.
 
ఒక ప్రాంతానికి న్యాయం జరగకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయిందన్న వెంకయ్య.. ఏపీకి తగిన న్యాయం చేసేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. గత ఏడాదికి సంబంధించి నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పారు.