శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (07:24 IST)

6 మందిని తొక్కి చంపిన మదపుటేనుగు

ఓ మదపుటేనుగు జనావాసాలపై పడి బీభత్సం సృష్టించింది. దొరికిన వారిని దొరికినట్లు తొండంతో బాది కాళ్ల కింద వేసి నలిపేసింది. ఒకరుకాదు, ఇద్దరు కాదు 6 మందిని తొక్కి చంపింది. మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. బీహార్ రాష్ట్రంలోని సీతారామర్తి జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
బిహార్‌లో సీతారామర్తి జిల్లాలోని మధుబని అనే గ్రామం సమీపంలో అడవులు ఎక్కువగా ఉన్నాయి. ఎండకాలం కావడంతో ఏనుగులు అడవులు దాటి బయటకు వస్తున్నాయి. అలాగే మంగళ, బుధవారాలలో ఓ మదపుటేనుగు ఆ గ్రామ సమీపంలోకి వచ్చింది. గ్రామ పరిసరాల్లో తిరుగుతూ అక్కడ ఉన్న జనంపై విరుచుకు పడింది. 
 
కనిపించిన వారిపై దాడి చేసింది. తొండంతో మోదింది. కొందరు తీవ్ర గాయాల పాలయి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. అయితే కొందరు దాని దాడి నుంచి తప్పించుకోలేక పోయారు. ఇలా మంగళవారం ఇద్దరిని బుధవారం నలుగురు వ్యక్తులను కాళ్లతో తొక్కి చంపేసింది. మిగిలిన గ్రామస్తులు తప్పించుకుని పారిపోయి ఇళ్లలో దాక్కున్నారు. చివరకు ఫారెస్టు అధికారులు వచ్చి ఏనుగును అడవుల్లో తరిమేశారు. 
 
మరో నలుగురిని తీవ్రంగా గాయపర్చింది. సంఘటనపై విచారం వ్యక్తం చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.