శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (17:44 IST)

ఇరకాటంలో బీజేపీ : మంత్రి దీపక్ ధావలికర్ సమర్థన!

మనమంతా సంపూర్ణ మద్దతిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారంటూ గోవా మంత్రి దీపక్ ధావలికర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. గతంలో గోవాలో బికినీలు నిషేధించాలంటూ వ్యాఖ్యానించిన మంత్రికి ఈయన స్వయాన సోదరుడు కావడం గమనార్హం. 
 
గోవా అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, అధికార బీజేపీని ఇరకాటంలోకి నెట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశాన్ని హిందూ దేశంగా మారుస్తారనే నమ్మకం తనకు ఉందంటూ నిండు సభలో ఆయన వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోడీని అభినందిస్తూ చేసిన తీర్మానం సందర్భంగా దీపక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
గోవా బీచ్‌లలో బికినీలపై నిషేధం విధించాలంటూ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించి... వివాదానికి తెర తీసిన ఆ రాష్ట్ర రవాణా మంత్రి సుదిన్‌కు దీపక్ స్వయాన సోదరుడు. బికినీల దుమారం మరువకముందే దీపక్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తాను మాట్లాడిన దాంట్లో తప్పేమిటని దీపక్ ఎదురు ప్రశ్నించారు.
 
శుక్రవారం దీపక్ మీడియాతో మాట్లాడుతూ అలా (హిందూ దేశంగా) చేయడం అవసరం అని అన్నారు. అన్ని జాతి ధర్మాలను ఏకతాటిపై తేవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఒకే హిందూస్థాన్ ఉందని, మరో హిందూస్థాన్ లేదని ఆయన అన్నారు.