శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (10:45 IST)

జడ్జిగారి గార్డెన్‌లోకి వెళ్లిన మేకపై క్రిమినల్ కేసు... అరెస్టు చేసిన ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు ఓ మేకను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇంతకీ ఆ మేక చేసిన తప్పు ఏంటో తెలుసా... న్యాయమూర్తి గార్డెన్‌లోకి వెళ్లడమే. జనక్‌పూర్ పట్టణానికి చెందిన అబ్దుల్ హసన్‌ అనే వ్యక్తికి ఓ మేకల మంద ఉంది. వీటిలోని ఓ మేక ఆయన ఇంటి పక్కనే మొదటి తరగతి జ్యుడి‌షియల్ మెజి‌స్ట్రేట్ హెచ్ రాట్రే బంగ్లా ఉంది. అందులోని గార్డెన్‌లోకి ఈ మేక వెళ్లి ఎంచక్కా పూల చెట్లను మేస్తోంది. 
 
దీనిపై ఆ న్యాయమూర్తి పలు సార్లు హెచ్చరించారు. అయినా మేక మాట వింటేనా.. పదే పదే వచ్చి చెట్లను పాడు చేస్తోంది. విసిగిపోయిన ఆయన సోమవారం సీనియర్ పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంకేముంది క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఆ మేకతో పాటు దాని యజమాని హసన్‌‌ను అరెస్ట్ చేశారు. 
 
మేక అరెస్ట్‌పై విమర్శలు రావడంతో చివరకు దాన్ని విడిచిపెట్టారు. కానీ హసన్‌ను మాత్రం పోలీసులు వదిలిపెట్టలేదు కదా కోర్టులో హాజరుపరిచారు. అయితే, హాసన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదనీ, అందువల్ల బెయిల్ తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి జైలులోనే కూర్చొన్నాడు.