శబరిమలలో వినూత్న నిరసన... దీపాలు పట్టుకుని 750 కి.మీలు....
శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉండే మహిళలు రాకూడదనే ఆచారం ఎన్నో దశాబ్దాలుగా ఉంది. అయితే మహిళలపై ఈ వివక్ష చూపడం సరికాదని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంటూ స్త్రీలకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు అందించిన ఈ తీర్పు పట్ల హిందువులు చాలా రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు.
కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయానికి అడ్డు చెప్పడం తగదని ఎంతోమంది అయ్యప్ప భక్తులు స్త్రీలను ప్రవేశించకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు. అయితే గురువారం నాడు అయ్యప్ప భక్తులు నిరసన తెలియజేసిన వినూత్న విధానం యావత్ భారతదేశాన్ని ఆకట్టుకుంది.
దాదాపు 750 కిలోమీటర్ల మేర రోడ్డుపై భక్తులు జ్యోతులు వెలిగించుకుని నిలబడ్డారు. ఈ దృశ్యం ఎంతో చూడముచ్చటగా కనిపించింది. అంతేకాకుండా ఇందులో మహిళలు, పిల్లలు కూడా పాల్గొన్నారు. మరి ఈ నిరసనలకు ప్రతిఫలం దక్కుతుందేమో వేచి చూడాలి.