సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (13:43 IST)

నూతన పార్లమెంట్ భవనానికి భూమిపూజ చేసిన ప్రధాని మోడీ!

నూతన పార్లమెంట్ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం భూమిపూజ చేశారు. ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో ఈ కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. వేద పండితులు వేదమంత్రోచ్చారణ చేస్తుండగా ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాలు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
 
త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనంలో ఐదు ఫ్లోర్లు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.971కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. లోక్‌సభకు ఆనుకుని ప్రధాని కార్యాలయం ఉంటుంది. 2022 ఆగస్టు నాటికి ఈ భవనం పూర్తి కానుంది. వందేళ్ల అవసరాలకు సరిపడేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, రాజకీయ పార్టీల నేతలతో పాటు పలు దేశాలకు చెందిన రాయబారులు సైతం పాల్గొననున్నారు.
 
వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా కొత్తగా పార్లమెంట్‌ నూతన భవనాన్ని కేంద్రం ప్రభుత్వం నిర్మిస్తోంది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో రూ.971 కోట్ల వ్యయం చేయనుంది. ప్రస్తుత భవనం కంటే 17వేల చదరపు కిలోమీటర్లు పెద్దగా ఉండనుంది. 
 
ఈ కొత్త భవన నిర్మాణం భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించనున్నారు. పురివిప్పి ఆడుతున్న నెమలి (జాతీయపక్షి), ఆకృతిలో లోక్‌సభ పైకప్పు, విరబూసిన కమలం (జాతీయ పుష్పం) రూపంలో రాజ్యసభ పైకప్పు, పార్లమెంట్‌లో అంతర్భాగంగా నిలువనున్న జాతీయ వృక్షం మర్రిచెట్టు రూపంలో తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ భవనాన్ని ఈ కొత్త భవనం రూపు పోలివుండనుంది.
 
పార్లమెంట్‌ కొత్త భవనంలో గ్రౌండ్‌, మొదటి, రెండు అంతస్థులు ప్రస్తుత భవనం ఎత్తు ఉండేలా కొత్త భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఒకే సారి 1,224 మంది ఎంపీలు కూర్చుకోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేయనున్నారు. 
 
భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం, బహుళ కమిటీలకు గదులు, భోజనశాలలు, లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా, సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు సైతం ఉండనున్నాయి. మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలకు 480 సీట్లు చొప్పున ఏర్పాట్లు చేస్తున్నారు.