శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2015 (16:08 IST)

హార్దిక్ పటేల్‌ను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి : గుజరాత్ హైకోర్టు

గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గం వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉధృతమైన ఉద్యమాన్ని నడిపిస్తున్న పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పీఏఏఎస్‌) కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ని పట్టుకోవాలని గుజరాత్‌ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆరావళి జిల్లాలో పోలీసుల అనుమతి తీసుకోకుండా హార్దిక్ పటేల్ మంగళవారం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న హార్దిక్ పటేల్... పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకుని అక్కడ నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో హార్దిక్‌ సహాయకుడు దినేష్‌ పటేల్‌ కోర్టును ఆశ్రయించారు. హార్దిక్‌ని పట్టుకోవడంపై కోర్టు కలుగజేసుకోవాలని అభ్యర్థించారు. దీంతో ఈ పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు గత అర్థరాత్రి 1:20గంటల ప్రాంతంలో విచారించింది. విచారణ అనంతరం జస్టిస్‌ ఎం ఆర్‌ షా, కేజే థాకర్‌లతో కూడిన ధర్మాసనం హార్దిక్‌ పటేల్‌ను వెతికి పట్టుకోవాలని గుజరాత్‌ ప్రభుత్వం, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, ఆరావళి జిల్లా ఎస్పీలను ఆదేశించింది. గురువారంలోగా సమాధానం ఇవ్వాలని కోరింది.