శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (12:35 IST)

ప్రతి పారిశుద్ధ్య కార్మికుడూ దళితుడే: ముంబై వాసి సునీల్ యాదవ్

నాలుగైదు డిగ్రీలు సంపాదించినా.. ముంబై వాసి సునీల్ యాదవ్ మాత్రం పారిశుద్ధ్య కార్మికుడిగానే కొనసాగుతున్నాడు. సునీల్ కుటుంబంలో నాలుగు తరాల నుంచి అందరూ పారిశుద్ధ్య కార్మికులే. తండ్రి ఉద్యోగం చేసేందుకు అనారోగ్యం అడ్డురావడంతో ఆ ఉద్యోగం సునీల్‌ను వెతుక్కుంటూ వచ్చింది. 2005 నుంచి 14 మధ్య బీకాం, జర్నలిజంలో బీఏ, గ్లోబలైజేషన్ అండ్ లాబర్ విభాగంలో ఎంఏ, సోషల్ వర్క్ లో మాస్టర్స్ చేసిన సునీల్ ప్రస్తుతం టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ఎం ఫిల్ చేస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో ఉద్యోగంలోకి వెళ్లిన తొలి రోజును సునీల్ యాదవ్ గుర్తు చేసుకుంటూ, "భారత నావికాదళం, సైన్యం చూస్తుండగా, ఓ మురుగు కాలువలోకి దిగాను. మరణించిన జంతు కళేబరాల మధ్య గడిపాను. ఆ వాసన రోజుల తరబడి నాకు గుర్తుండిపోయింది. అప్పుడే నిర్ణయించుకున్నాను. నేను చదివి పరిస్థితులు మార్చాలని" అని చెప్పాడు. కానీ ప్రతి దళితుడూ పారిశుద్ధ్య కార్మికుడు కాదని, ప్రతి పారిశుద్ధ్య కార్మికుడూ దళితుడేనని, ఈ ఒక్క విషయంలో మాత్రం 100 శాతం రిజర్వేషన్ అమలవుతోందని సునీల్ ఉద్వేగంగా అన్నాడు. 
 
''తాము సఫాయి కార్మికులుగా పుట్టాము. పుట్టినప్పటి నుంచి బానిసలుగా బతికాము. మాకు ఎన్నడూ ఏ హక్కులూ లేవు. పరిస్థితుల నుంచి బయటపడేందుకు మార్గాలు లేవు. 'మీరు చదువుకుంటే ఎదుగుతారు' అని బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. కానీ, మా విషయంలో ఇప్పటికీ ప్రజలు దాన్ని అంగీకరించడం లేదు" అని సునీల్ వాపోయాడు.