ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థినికి అకతాయిల వేధింపులు... భగ్గుమన్న విద్యార్థులు. క్యాంపస్‌లో ధర్నా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉన్న ఐఐటీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో గురువారం తెల్లవారుజామున ఓ విద్యార్థిని ముగ్గురు ఆగంతకులు వేదింపులకు గురిచేసారు. బలవంతంగా ఓ మూలకు లాక్కెళ్లి.. అక్కడ ఆమె దుస్తులు తొలగించి వీడియో రికార్డింగ్ చేశారు. బాధితురాలి ఫోన్ నంబరు తీసుకుని విడిచిపెట్టారు. దీనిపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెల్సిందే. కాలేజీ విద్యార్థులు భగ్గుమన్నారు. కాలేజీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. ఓ బైకును కూడా తగులబెట్టారు. ముగ్గురు ఆకతాయిల చేతిలో ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థిని విద్యార్థిని లైంగిక వేధింపులకు గురికావడం కలకలం రేపుతోంది.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో... ఆమె తన స్నేహితుడితో కలిసి హాస్టల్ నుంచి బయలుదేరగా కర్మన్ బాబా టెంపుల్ వద్ద బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించారు. యువతిని ఆమె ఫ్రెండ్ నుంచి దూరంగా ఓ మూలకు తీసుకెళ్లి దుస్తులు తొలగించి వీడియోతో రికార్డు చేశారు. బలవంతంగా ఆమెను ముద్దులు పెట్టి ఫొటోలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకుని 15 నిమిషాల తర్వాత విడిచిపెట్టారు.
కాగా, యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆగంతుకులపై సెక్షన్ 354తో పాటూ ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, యువతికి వేధింపుల ఘటన గురించి తెలియడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. క్యాంపస్‌లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వద్ద వారు ధర్నాకు దిగారు. ఇది బయటవ్యక్తుల పనేనని, వారిని క్యాంపస్ లోపలికి రాకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై స్పందించిన డీసీపీ ఆర్.ఎస్.గౌతమ్ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీసీటీవీలు నిరంతరం పనిచేసేలా, విద్యుత్ అంతరాయాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు మెమొరాండం ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిందితుల ఆచూకీ కనుగొనేందుకు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశిలిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.