శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2014 (11:11 IST)

నేపాల్ వీలైనంత త్వరగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి: మోడీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన చారిత్రాత్మక నేపాల్ పర్యటనను సోమవారం ముగించుకుని స్వదేశానికి తిరిగి వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే కృషిలో భాగంగా నేపాల్‌కు వివిధ రకాల సహాయాన్ని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 17 ఏళ్లలో నేపాల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీయే కావడం విశేషం. 
 
నేపాల్ వీలయినంత త్వరగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు రాంభరణ్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా సహా ఆ దేశ నాయకులకు మోడీ నొక్కి చెప్పారు. 
 
‘మీరు పార్టీ గురించి కాదు దేశం గురించి ఆలోచించండి. నేపాల్‌కు వీలయినంత త్వరగా రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరం ఉంది’ అని మోడీ వారికి చెప్పినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోబోదని మోడీ తన పర్యటనలో నేపాల్‌కు హామీ ఇచ్చారు.