శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (20:28 IST)

ముగ్గురు భర్తల సమక్షంలో ఇంద్రాణి విచారణ.. కుటుంబమంతా ఖార్ స్టేషన్‌లోనే...

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ముంబై ఖార్ స్టేషన్ పోలీసులు వడివడిగా అడుగులు వేస్తూ.. విచారణలో పురోగతి సాధిస్తున్నారు. తమ కస్టడీలో ఉన్న ఇంద్రాణి వద్ద ఇప్పటికే అనేక విషయాలపై ఆరా తీసిన పోలీసులు.. శుక్రవారం ఇద్దరు మాజీ భర్తలు సిద్ధార్థ్ దాస్, సంజీవ్ ఖన్నా, ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాల సమక్షంలో విచారణ జరిపారు. దీంతో ఖార్ పోలీసు స్టేషన్ ఇంద్రాణి కుటుంబ నివాసంగా మారిపోయింది. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటికే షీనా బోరా, మైఖేల్ బోరాల తండ్రిగా భావిస్తోన్న సిద్ధార్థ్ దాస్‌ను కూడా ఖార్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించారు. ఆయన డీఎన్‌ఏను కూడా సేకరించగా, దీన్ని షీనా డిఎన్‌ఏతో పోల్చి చూడనున్నారు. అలాగే, ఇంద్రాణి ముఖర్జీకి సంజీవ్ ఖన్నా ద్వారా జన్మించిన విధి కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. విధికి ఆస్తి దక్కదన్న అక్కసుతోనే సంజీవ్ ఖన్నా... షీనా బోరాను చంపినట్లు తొలుత వార్తలు వచ్చిన విషయంతెల్సిందే. 
 
మరోవైపు షీనా బోరా కేసులో ఇంద్రాణి చేసిన నేరాన్ని అంగీరించినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే, దీనిపై పోలీసులు ఓ స్పష్టత ఇవ్వాల్సివుంది. గత పది రోజుల్లో 160 గంటల పాటు ఇంద్రాణి వద్ద పోలీసులు వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ముగ్గురు భర్తలు సిద్ధార్థ్ దాస్, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియాల సమక్షంలో ఇంద్రాణి వద్ద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ కూడా ఉన్నారు. ఈయన ఇప్పటికే నేరాన్ని అంగీకరించిన విషయంతెల్సిందే. ఈ విచారణ తర్వాత ఈ మిస్టరీ డెత్‌ స్టోరీని పోలీసులు విపులంగా మీడియాకు వివరించనున్నారు.