శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (20:57 IST)

కడుపులో కెమికల్స్ ఏమీ లేవు కానీ మూత్రంలో మాత్రం... ఇంద్రాణి అపస్మారకం... ఏంటి సంగతి...?

కన్న కూతురు షీనా బోరాను పొట్టనబెట్టుకున్న తల్లిగా లోకానికి తెలిసిన ఇంద్రాణి ముఖర్జీయా ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. అసలామె ఏం తీసుకున్నదని తేల్చేందుకు ఆమె కడుపులోని పదార్థపు శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపించారు. ఐతే ఆ రిపోర్టులో ఆమె ఎలాంటి ఓవర్ డోస్ మందులు మింగలేదనీ, ఆమె జీర్ణాశయంలో ఎలాంటి రసాయనాలు లేవని తేలింది. ఐతే ఆమె మూత్రంలో మాత్రం అత్యధిక స్థాయిలో యాంటి డిప్రెసెంట్ మందుల తాలుకు నిల్వలు అధికంగా ఉన్నట్లు రిపోర్టులో తేలింది. ఆ ప్రకారం చూస్తే ఇంద్రాణి ముఖర్జీయా అపస్మారక స్థితిలో ఉండటం ప్రమాదకరమేనని అంటున్నారు. 

 
వైద్యులు మరో వాదనను వినిపిస్తున్నారు. కొన్ని రకాల మాత్రలు నేరుగా శరీర నాళాల్లోకి వెంటనే పీల్చుకోబడుతాయనీ, అలాంటప్పుడు కడుపులో ఎలాంటి రసాయనాలు ఉన్నట్లు ధృవీకరణ కాదని అంటున్నారు. అదే జరిగితే ఆమె పరిస్థితిని ఆదివారం నాటికి గాని చెప్పలేమని అంటున్నారు. మరోవైపు, ఇంద్రాణి ఆరోగ్యం పట్ల ఏదైనా గోల్‌మాల్ జరుగుతోందా... అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 
 
అసలు ఆమె అపస్మారక స్థితిలో ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంద్రాణి ముఖర్జీయ తరపు న్యాయవాది శనివారం ఆమె పరిస్థితిని చూసేందుకు అనుమతించాలని కోరితే అందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించింది. ఈ నేపధ్యంలో అసలు ఇంద్రాణి ఆరోగ్యం ఎలా ఉందన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.