శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: బుధవారం, 4 మార్చి 2015 (08:37 IST)

ఆప్ లో అంతర్గత పోరు... కేజ్రీకి కొత్త తలనొప్పి. నేడు జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం

జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. పార్టీలో అంతర్గత పోరు ఆయనకు నిద్ర లేకుండా చేస్తోంది. చీపురు పెట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ఊడ్చేసిన కేజ్రీవాల్ తన ఇంటిలోని అపరిశుభ్రతపై పెద్దగా దృష్టి పెట్టినట్లు లేడు. అందుకే పాపం కొత్త సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
సీనియర్లుగా ఉన్న ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లతో తనకు చిక్కులు వచ్చిపడుతున్నాయి. వారు ఇప్పటికే కేజ్రీవాల్ వర్గంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై బుధవారం జాతీయ కార్యవర్గ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో పార్టీ ఏ ర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో పార్టీ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి ఉద్వాసన పలకడానికి అరవింద్ కేజ్రీవాల్ వర్గం రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. 
 
మరోవైపు ప్రశాంత్ భూషణ్‌పై కేజ్రీవాల్ వర్గం విమర్శల దాడి పెంచింది. ‘శాంతి భూషణ్, ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్, కుమార్తె షాలిని భూషణ్ పార్టీలోని అన్ని విభాగాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు.  ఏక వ్యక్తి పార్టీగా ఉండకూడదని చెబుతున్న వీరు ఆప్‌ను వారి కుటుంబ పార్టీగా చేయాలని చూస్తున్నారు’ అని ఆప్ నేత ఆశీష్ ఖేతాన్ మండిపడ్డారు. కాగా, కేజ్రీవాల్‌పై ఇటీవలి వరకు విమర్శలు కురిపించిన ఆప్ వ్యవస్థాపక సభ్యుడు శాంతిభూషణ్ మాట మార్చారు. కేజ్రీవాల్ పార్టీ జాతీయ కన్వీనర్‌గా కొనసాగాలని, యోగేంద్ర, ప్రశాంత్ లు ఆయనకు సహకరించాలని సూచించారు. 
 
అంతర్గత కలహాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం నిర్వహించనున్నఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకావడం లేదు. అనారోగ్యం కారణంగా ఈ భేటీకి రాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ సమాచారమిచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పది రోజులపాటు నేచురోపతి చికిత్స తీసుకునేందుకు ఆయన బెంగళూరు వెళ్లనున్నారని తెలిపాయి. ఒత్తిడి కారణంగా కేజ్రీవాల్ దేహంలో షుగర్ స్థాయి బాగా పెరిగిందని, మాత్రలు, ఇన్సులిన్ తీసుకున్నా.. నియంత్రణలోకి రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
 
పార్టీలో అంతర్గత కలహాలు తనను బాధించాయని, ఆ మురికి యుద్ధంలోకి తాను దిగదల్చుకోలేదని ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఇలా గొడవ పడడం ఢిల్లీవాసులు పార్టీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడమేనన్నారు. గొడవలోకి దిగను. ఢిల్లీ పాలనపైనే నా దృష్టి నిలుపుతానని తెగేసి చెప్పారు.