శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 అక్టోబరు 2014 (13:01 IST)

జమ్మూకాశ్మీర్ - జార్ఖండ్‌లు ఐదు దశల్లో.. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 23

జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభలకు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, సుప్తచేతనావస్థలో ఉన్న ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న డిమాండ్‌ను ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఇక్కడ ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది. 
 
ఇదిలావుండగా, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రధానాధికారి సంపత్ శనివారం వెల్లడించారు. ఐదు దశల్లో జరిగే ఈ పోలింగ్ ప్రక్రియలో... తొలి దశ ఎన్నికలు నవంబర్‌ 25న ప్రారంభమవుతుంది. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో తక్షణం ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. 
 
కాగా దేశంలోని ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు భిన్నంగా జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఆరేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 2008 ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 19తో ముగియనుంది. కాంగ్రెస్‌ మరోసారి నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో జతకట్టేందుకు తహతహలాడుతోంది. మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్‌ సయ్యద్‌ నేతృత్వంలోని ప్రధానప్రతిపక్షం పీపుల్స్‌ డెమెక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీపీ) తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ సైతం జమ్మూకశ్మీర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించాలని వ్యూహరచన చేస్తోంది. కాగా, ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని మొత్తం స్థానాలు... వివిధ పార్టీల బలాబలాలు పరిశీలిస్తే... 
 
అసెంబ్లీలో మొత్తం స్థానాలు 87స్థానాలు 
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ : 28, జేకే పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌: 21, కాంగ్రెస్‌: 17, బీజేపీ: 11, నేషనల్‌ పాంథర్స్‌ పార్టీ: 3, సీపీఎం :1, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ : 1, డెమోక్రటిక్‌ పార్టీ నేషనలిస్ట్‌ :1, స్వతంత్రులు: 4.
 
జార్ఖండ్‌ అసెంబ్లీ మొత్తం స్థానాలు 81. వివిధ పార్టీల బలాబలాలు 
కాంగ్రెస్‌, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా(జేవీఎం), సీపీఎం కూటమి: 25, బీజేపీ, జేడీ(యు) కూటమి: 20, జేఎంఎం: 18, స్వతంత్రులు 18.
 
ఎన్నికల షెడ్యూల్‌ ఇదీ
తొలి దశ పోలింగ్‌ : నవంబర్‌ 25
రెండో దశ : డిసెంబర్‌ 2
మూడో దశ : డిసెంబర్‌ 9
నాలుగో దశ : డిసెంబర్‌ 14
ఐదో దశ : డిసెంబర్‌ 20
ఓట్ల లెక్కింపు : డిసెంబర్‌ 23