శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (11:25 IST)

మహిళా డాక్టర్‌ కాలర్ సరిచేసిన జమ్మూ కాశ్మీర్ మంత్రి: మళ్లీ వివాదంలోకి..

జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. అమర్ నాథ్ యాత్ర కోసం ఆసుపత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన.. మహిళా డాక్టర్‌ కాలర్ సరిచేయడం ద్వారా వార్తల్లోకెక్కారు. లఖన్ పూర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఆస్పత్రిలో ఓ వైద్యురాలిని చూసిన మంత్రి ఆమె కాలర్ సరిగా లేదన్న విషయం గుర్తించి, అదే విషయాన్ని ఆమెతో చెప్పారు. అంతటితో ఆగకుండా తానే ఆ లేడీ డాక్టర్ కాలర్ సరిచేశారు. పాపం! ఆ వైద్యురాలు మంత్రి చర్యకు అభ్యంతరం చెప్పలేదట. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో లేడీ డాక్టర్ మంత్రి చర్యను గమనించి హడావుడిగా తన కాలర్ సరిచేసుకుందట. 
 
కాగా, మంత్రి చౌదరీ లాల్ సింగ్ చర్యను నెటిజన్లు తప్పుబట్టారు. ఓ మహిళను తాకడం సమంజసం కాదు అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు పోస్ట్ చేశారు. ఇకపోతే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరోగ్య మంత్రి తీరుపై ఓ మహిళా వైద్యురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. ల్యాబ్ కోటు ధరించలేదంటూ ఆయన ఆ లేడీ డాక్టర్‌ను చీవాట్లు పెట్టిన మంత్రి.. మంత్రి తనను మానసిక వేధింపులకు గురిచేశారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.