శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (11:57 IST)

తమిళనాడు కొత్త సీఎం పన్నీర్ సెల్వం : ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు!

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖామంత్రి ఒ.పన్నీర్ సెల్వం మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ కె రోశయ్య నుంచి ఆహ్వానం అందింది. తమిళనాడులో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష నేత పన్నీర్ సెల్వంకు ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆహ్వానం పంపారు. అయితే, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పన్నీర్ సెల్వం తర్జనభర్జనలు చెందుతున్నారు. జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయడమే ఇందుకు నిదర్శనం. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితకు ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయారు. ఫలితంగా ఆమె స్థానంలో కొత్త వారసుడి ఎంపిక జయలలిత ఆదేశం మేరకు ఆదివారం రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇందులో జయలలిత సూచన మేరకు.. తన వీరవిధేయుడు, మంత్రి పన్నీర్ సెల్వంను ఏడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 
 
ఆ తర్వాత శాసనసభపక్ష నేత హోదాలో పన్నీర్ సెల్వం రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ లేఖను అందజేశారు. ఫలితంగా పన్నీర్ సెల్వంను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు.