శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (09:09 IST)

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నా : జయ దీప వెల్లడి

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతితో ఖాళీ ఏర్పడిన చెన్నై, ఆర్కే నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఎంజీఆర్ అమ్మా దీప పేరవై వ్యవస్థాపకురాలు, జయలలిత మేనకోడలు జయదీపా ప్రకటించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతితో ఖాళీ ఏర్పడిన చెన్నై, ఆర్కే నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఎంజీఆర్ అమ్మా దీప పేరవై వ్యవస్థాపకురాలు, జయలలిత మేనకోడలు జయదీపా ప్రకటించారు. ఇదే అంశంపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 
 
తనకు మద్దతు ఇవ్వాలని మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను కలిసి అడగబోమన్నారు. అలాగనీ, తనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చే పార్టీలను స్వాగతిస్తామని చెప్పారు. ఇకపోతే, శశికళ, డీఎంకే మినహా ఇతరులు ఎవరైనా మద్దతిస్తే స్వీకరిస్తామన్నారు. 
 
ఇదిలావుండగా, ఆర్కే. నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉపఎన్నికలు జరగనుండగా, ఈనెల 23 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 
 
మరోవైపు... జయలలిత మరణం అనంతరం దీపకు మద్దతిస్తామని, శశికళకు మద్దతివ్వమని ఆర్కే.నగర్ వాసులు బహిరంగంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇంకోవైపు ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తమకే ప్రజల మద్దతు ఉందని నిరూపించుకోవాలని శశికళ వర్గం ప్రయత్నాలు ప్రారంభిస్తోంది.
 
మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం కూడా విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు డీఎంకే కూడా విజయం కోసం బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉపఎన్నిక అక్కడ పోటీకి దిగనున్న అందరికీ ప్రతిష్టాత్మకంగా మారింది.